తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమనడం కాంగ్రెస్(Congress)కు సబబు కాదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పరిపాలనపై ప్రజల్లో చర్చ మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపారు. పథకాల అమలుకు ప్రభుత్వంగా సమయం తీసుకుంటే తప్పులేదు కానీ, ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు. తెలిసీ, తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలా మారాయని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని ఆరోపించారు. ‘420’ అంటూ వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. వాళ్ల దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాల 420 ఉన్నాయన్న ఆయన ఆ హామీలను ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందన్నారు. పరిపాలన చేతకాకపోతే అనుభవజ్ఞుల సాయం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.