రాష్ట్ర పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులను తిరిగి తేకపోతే కాంగ్రెస్ (Congress) వాళ్లను గ్రామాల్లో తిరగనియ్యబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) హెచ్చరించారు. ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జగదీశ్ రెడ్డి.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దక్షిణ తెలంగాణ (Telangana) దద్దరిల్లేలా నల్లగొండ (Nallagonda)లో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సభలో కేసీఆర్, కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతారని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకొనేందుకే కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని విమర్శించిన జగదీశ్ రెడ్డి.. కేసీఆర్ గుర్తులు చేరిపేస్తామని అనడం ఆయన నీచ సంస్కృతి అద్దం పడుతుందని విమర్శించారు. నిజంగానే కేసీఆర్ గుర్తులు ఇవాళ మాయం అవుతున్నాయని పేర్కొన్నారు.
24 గంటల కరెంట్ కేసీఆర్ గుర్తు.. అది మాయమైంది. రైతుబంధు డబ్బులు కేసీఆర్ గుర్తు.. అది మాయమైందని అన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతాం అని రైతులను అవమానించడం పాలకుల లక్షణం కాదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి దొంగల చేతిలోకి తెలంగాణ వెళ్లిందని ఆరోపణలు చేశారు. బహిరంగ సభకు ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సభను విజయవంతం చేసి తీరుతామని తెలిపారు.
పెద్ద పెద్ద రాకాసులతో కొట్లాడిన వాళ్లమని, చిన్నపాటి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి లాంటి వారు తమకు లెక్క కాదన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహన లేదన్నారు. విజ్ఞానం లేని వాళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులంటూ జగదీశ్ రెడ్డి విమర్శలు చేశారు. కాగా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, సభ సమన్వయకర్త రవీందర్ సింగ్, డాక్టర్ చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, తండు సైదులు గౌడ్, దేవేందర్ ఉన్నారు.