టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీల్డ్ కవర్ సీఎం అంటూ ప్రధాని మోడీ(PM Modi)పై సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), మోడీ చుట్టే తిరుగుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ చరిత్ర, రాజకీయంపై బీజేపీ(BJP) నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ముందు వీళ్లంతా చిన్న వ్యక్తులని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
ఈటల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని విమర్శించారు. రాహుల్ గాంధీ, మోడీకి చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. మోడీ ప్రధాని కాకముందు అద్వానీ రథయాత్ర ప్రారంభ సమయంలో ఆయన వెనక ఉండి సర్వీస్ చేసే వాడని గుర్తుచేశారు. అద్వానీ రథయాత్రకు ముందు మోడీ ఎవరో కూడా గుజరాత్ ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. అద్వానీ రథయాత్ర పూర్తయ్యాకే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోడీ గెలిచారని తెలిపారు.
మోడీ గెలిచిన తర్వాత అద్వానీ సీల్డ్ కవర్లో సీఎంగా ప్రకటించారని చెప్పారు. బీజేపీ నేతలు మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్లో డిసైడ్ చేశారని తెలిపారు. సీఎంలను డిసైడ్ చేసే రాహుల్ గాంధీకి సీల్డ్ కవర్ సీఎం మోడీకి చాలా తేడా ఉంది, మోడీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని చెప్పుకొచ్చారు. మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని జగ్గారెడ్డి అన్నారు.
రాముడు పేదల కోసం పాలన చేశాడేకానీ తనకు గుడికట్టమని చెప్పలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలా చేస్తే రాముడు సంతోషిస్తానని చెప్పాడా? రామాలయ నిర్మాణంతో సమస్యలు తొలగిపోయాయా? అని ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి, ఈటల, సంజయ్‌లు రాజకీయంగా బతకాలంటే జైశ్రీరామ్ అనకతప్పదన్నారు. శ్రీరామ చంద్రుడి నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే అని వ్యాఖ్యానించారు. రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు.