ఒకరిది టైటిల్ లొల్లి.. మరొకరిది డాక్యుమెంట్ వివాదం.. ఇలా ఒక్కొకరిది ఒక్కో కష్టం. రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక భూ వివాదం వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా జగిత్యాల (Jagtial) జిల్లాలో భార్యాభర్తలు భూ వివాదంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేగింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.
నర్మెట్ట మండలం సూర్యబండ తండాలో ఉంటున్నారు గురు, సునీత దంపతులు. వీరికి చెందిన 1.09 ఎకరాల భూమి (Land) విషయంలో వివాదం నడుస్తోంది. గ్రామానికి చెందిన కొందరు తమ భూమిని ఆక్రమిస్తున్నారని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సెల్ఫీ వీడియో తీస్తూ తమ బాధను వివరించారు. గ్రామంలోని భుక్య జయరాం, భుక్య సురేందర్, భుక్య శ్రీనులతో వివాదం ఉందని తెలిపారు.
గొడవ జరిగినప్పుడల్లా పోలీసులను ఆశ్రయించడం.. తర్వాత సద్దుమణగడం జరుగుతూ వస్తోంది. కానీ, ఇకపై తమ వల్ల కాదని.. ప్రత్యర్థులు పొలంలో జేసీబీలతో భూమిని చదును చేస్తూ ఆక్రమించుకునేందుకు చూశారని.. తీవ్ర ఆవేదనకు గురైన భార్యభర్తలు సెల్ఫీ వీడియో తీశారు. దీనికి సంబంధించి సూసైడ్ నోట్ కూడా రాశారు బాధితులు.
తాము చనిపోతే భూమి ఎవరికి చెందాలనే వివరాలను ఆ నోట్ లో వివరించారు. ఆ తర్వాత పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి వారిని దగ్గర్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదం కావడంతో జాగ్రత్తగా విచారణ జరుపుతున్నారు.