భారత విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Shankar) కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ(Melanie Jolie)తో భేటీ అయ్యారు. జర్మనీ(Germany)లో జరుగుతోన్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్సు(Munich Security Conference)లో భాగంగా వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, కెనడాల మధ్య ధౌత్య సంబంధాలపై చర్చించినట్లు సమాచారం.
జర్మన్ కౌంటర్ అన్నాలెనా బేర్బాక్, అర్జెంటీనా కౌంటర్ డయానా మొండినోతోనూ జైశంకర్ సమావేశమయ్యారు. అదేవిధంగా ప్రపంచ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై జైశంకర్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘కెనడియన్ కౌంటర్ మెలానీతో భేటీ కావడం సంతోషకరం. ఈ సమావేశంలో ఇరు దేశాల సంబంధాలు, ప్రపంచ పరిస్థితులపై చర్చించాం’’ అని పేర్కొన్నారు.
గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణలు చేయడంతో భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏటా జర్మనీలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తారు.
ఈ వేదికపై అంతర్జాతీయ భద్రతా విధానాలపై చర్చిస్తారు. ఇది 1963లో ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశం 60వది. ఈ నెల 18వరకు ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. అమెరికాలోని జర్మన్ రాయబారి క్రిస్టోఫ్ హ్యూస్జెన్ అధ్యక్షతన ఈ ఏడాది సదస్సు జరుగుతోంది. సుమారు 70కి పైగా దేశాలు, 350కి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు.