ప్రముఖ నిర్మాత(Producer) బన్నీవాసు(Bunny vasu)కు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalian) కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన ప్రచార విభాగం చైర్మన్గా బన్నీవాసును నియమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేనాని గురువారం ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని బన్నీవాసుకు అందజేశారు.
ఇక, పార్టీకి ప్రచార విభాగం కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని పవన్ కల్యాణ్ సూచించారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలని సూచిస్తూ.. ఈ సందర్భంగా బన్నీ వాసుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన.. తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు నడుస్తోంది. తన భవిష్యత్తు కోసం తానే చేయడం లేదన్న జనసేనాని ఏపీ భవిష్యత్తు కోసమే తాను కృషిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని, తాను దశాబ్దకాలంగా పని చేస్తున్నట్లు తెలిపారు. పల్లం వైపే నీరు వెళ్తుందని, పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు దానంతట అదే వస్తుందంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణపై పలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా పని చేయాలంటూ పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలి. అప్పుడే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమని పవన్ తెలిపారు.