ఏపీలో టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమి దూకుడు పెంచింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీతో జనసేన మధ్య ప్రాథమికంగా ఓ ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలైనట్టు సమాచారం. రాష్ట్రంలో 35 నుంచి 50 వరకు స్థానాల్లో జనసేనకు అవకాశం ఇచ్చేందుకు టీడీపీ ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
సీట్ల సర్దుబాటు విషయంలో ప్రాథమికంగా ఒక ఒప్పందానికి రావడంతో ఇరు పార్టీలు అభ్యర్థులపై కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏయే స్థానాల్లో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయనే విషయంపై ఇప్పటికే జనసేనానీ సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల ఆధారంగా ఆయా స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలో కి దించాలనే యోచనలో పవన్ ఉన్నారు.
ఏ నియోజక వర్గంలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి., ఎవరికి సీటు కేటాయిస్తే పార్టీకి లాభం చేకూరుతుందనే విషయాలపై ఇరు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థుల విషయంలో ఒక అవగాహనకు వచ్చాక ఇరు పార్టీలు చర్చించుకుని విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సంక్రాతి నాటికి టీడీపీ-జనసేనలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
మొదటి విడతల కృష్ణ, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ ప్రాంతాల అభ్యర్థుల ఉమ్మడి జాబితాను టీడీపీ-జనసేన ప్రకటించనున్నాయి. గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక విషయం ఇరు పార్టీలకు కాస్త ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో పవన్ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ జనసేన శ్రేణులతో చర్చల అనంతరం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనున్నారు.