ఏపీ(AP)లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీకి చెందిన రెండు స్థానాలను జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. జనసేన (Janasena) కార్యాలయంలో శుక్రవారం ఆయన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ… రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని జనసేనాని తప్పుబట్టారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై బాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలని, కానీ టీడీపీ అది విస్మరించిందన్నారు.
ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్లే తాము రెండు సీట్లు ప్రకటిస్తున్నామని చెప్పారు. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని, ప్రత్యేక పరిస్థితుల్లోనే తామూ రెండు సీట్లు ప్రకటిస్తున్నామని పవన్‌కల్యాణ్ వెల్లడించారు. పొత్తులపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని జనసేన చీఫ్ అన్నారు. నారా లోకేష్ మా నాన్నే సీఎం అవుతారని మాట్లాడినా మౌనంగా ఉన్నానని తెలిపారు.
జగన్ నడిపే ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలని, ప్రజలకు మేలు జరగాలని తాను కోరుకుంటున్నాని చెప్పారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటన జనసేనలో ఆందోళన చెలరేగించిందని జనసేనాని అన్నారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని, ఎన్నికల్లో మూడో వంతు సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.