భారత చరిత్రలో జనవరి 22 ఒక మరిచి పోలేని రోజుగా ఉంటుందని బీజేపీ (BJP)రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు (GVL Narasimha Rao) అన్నారు. ప్రపంచంలోని హిందువుల ఆరాద్య దైవం శ్రీరాముడని వెల్లడించారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం 550 ఏండ్ల కల అని పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ….. అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయికాట్ చేయడం దారుణం అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇది పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు.
హిందూ బాహుల్య దేశమైన భారత్లో గతంలో హిందువుల కళలు, అధికారాలను అణచి వేశారని ఆరోపణలు గుప్పించారు. కొన్ని పార్టీలు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా హిందువులు దెబ్బతిన్నారు అని విమర్శలు చేశారు. దేశ ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిష్టను తగ్గించాలన్న దురాలోచనతో విపక్షాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వివిధ క్రతువులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకు వచ్చారు. ఈ నెల 22న విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.