జపాన్(Japan) వరుస భూకంపాలతో(Earthquakes) అల్లకల్లోలంగా మారుతోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనవరి 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు 92 ప్రాణాలు కోల్పోయారు. మరో 242 మంది అదృశ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 32 వేల మంది బాధితులు నిరాశ్రయులయ్యారు.
ఈ భారీ భూకంపం సునామీని ప్రేరిపించింది. తీరంలో ఒక మీటర్ ఎత్తుతో అలలు ఎగిసిపడ్డాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భూకంపం 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీని గుర్తుకు తెచ్చింది. తాజాగా సంభవించిన విపత్తులో కేవలం రోజు వ్యవధిలోనే 150కి పైగా భూకంపాలు సంభవించాయి.
న్యూ ఇయర్ మొదటి రోజునే భారీ భూకంపం జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు అక్కడి రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. అయితే సహాయక చర్యలకు సమయం మించిపోతుండటంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా తాగునీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదని బాధితులు తెలిపారు. కాగా, శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు.