కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అన్యాయంగా తమ కార్యకర్తలపై కేసులు పెడుతోందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తూ, కేసులు పెట్టిస్తున్నారన్నారని కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి.. దళిత యువకుడు బలవన్మరణం చేసుకొంటే బాధితులను పరామర్శించకుండా ఒక నేరస్థుడిని పరామర్శిస్తారా అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో నమోదైన కేసుతో తమకేం సంబంధం అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి.. కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే నేర నిర్ధారణ జరిగినా కూడా నిందితుడైన సర్పంచును పరారీలో చూపెట్టారని ఆరోపించారు. అందుకే దళిత యువకుడు బలవన్మరణం చేసుకొన్నాడని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు చేస్తారని భావించడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.
మరోవైపు సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలని రిపోర్ట్ లో ఉందని అన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీకి పోలీసులు ఫ్రెండ్లీ కాబట్టి సర్పంచును అబ్ స్క్యాండింగ్ గా చూపించారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.. ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచించాలని పేర్కొన్న జీవన్ రెడ్డి.. ఈ ఘటనపై ఎస్పీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
చట్టం, పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయి శివనాగేశ్వర్ ప్రాణం అర్పించుకొన్న విషయాన్ని కవిత గుర్తించి మాట్లాడాలని సూచించారు. రాజకీయ లబ్ధికోసం అనవసరమైన ఆరోపణలు చేసే బదులు కొడుకును కోల్పోయిన తల్లిని పరామర్శిస్తే సంతోషించే వాడినని పేర్కొన్నారు. ఎంతవరకు రాజకీయ కోణం తప్ప మానవత్వం లేని అమ్మగారు జాగృతి సామాజిక స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలుగా విచారణ చేయించుకో అని జీవన్ రెడ్డి కోరారు.