అందినకాడికి దోచుకోవడమే బీఆర్ఎస్(BRS) విధానమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevanreddy) విమర్శించారు. హైదరాబాద్ (Hyderabad) గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కమీషన్లకు కక్కుర్తి పడే యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మించారని ఆరోపించారు.
దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ తీసుకురాలేని రక్షణ శాఖ భూముల అనుమతులను సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చారని తెలిపారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్ మోడీ ముందు మోకరిల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో రాష్ట్రాభివృద్ధి గురించి చర్చించకుండా రాజకీయాలు మాట్లాడారని దుయ్యబట్టారు. తెలంగాణకి ఏం కావాలని ప్రధాని అడిగితే హామే కు కుచ్ నహీ చాహియే అని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు మోడీతో కేసీఆర్ సఖ్యతగా ఉన్నారని తెలిపారు. విభజన చట్టంలోని హామీలను కేసీఆర్ తేవడంలో విఫలం అయ్యారని విమర్శించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ అవినీతిలో కేంద్రానికీ వాటా ఉందంటూ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎలా రుణం ఇచ్చిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జలవనరుల శాఖ అనుమతులు లేవన్నారు.
అనుమతుల్లేని ప్రాజెక్టులకు కేంద్రం అప్పులు ఇచ్చి కేసీఆర్ అవినీతిని ప్రోత్సహించిందన్నారు. కాంగ్రెస్ నేతల మధ్య బీఆర్ఎస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఆడబిడ్డలందరికీ ప్రతీక సీతక్క అని, తెలంగాణ ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కలను రేవంత్ తీరుస్తున్నారని తెలిపారు. ఎంతమంది ఏకమైనా రేవంత్‌ను ఏం చేయలేరని అన్నారు.