J
Jharkhand: మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్.. ఈ కేసులో తనకు ఈడీ జారీ చేసిన సమన్లను పట్టించుకోకుండా సుప్రీంకోర్టుకెక్కారు. . రెండో సారి కూడా ఈడీ అధికారుల ఎదుట ఆయన హాజరు కాలేదు. ఈ సమస్యపై తాను అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశానని, అందువల్ల మీ ఎదుట తాను హాజరుకావలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో సొరేన్ స్టేట్మెంట్ ను తాము నమోదు చేయవలసి ఉందని, అందువల్ల ఆగస్టు 14 న ఆయన తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆగస్టు 8 న ఆయనకు సమన్లు జారీ చేసింది.
కానీ ఆ రోజున తనకు బిజీ షెడ్యూల్ ఉందని , విచారణకు హాజరు కాలేనని ఆయన తెలిపారు. దీంతో ఈ నెల 24 లోగా రావాలని ఈడీ సమన్లు పంపినా.. వాటిని ఆయన ఖాతరు చేయలేదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానని ఆయన ఈడీకి పంపిన లేఖలో తెలిపారు. నేనేదో దేశం విడిచి పారిపోతున్నట్టు ఈడీ భావిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
తనపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని సొరేన్ ఆరోపించారు.అయితే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానికి లొంగే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ తో బాటు మరో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఆయనను గత ఏడాది నవంబరు 17 న తొమ్మిది గంటల పైగా విచారించింది.
కాగా-ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్టాఫ్ మెంబర్ ద్వారా ఈడీ జోనల్ కార్యాలయానికి తెలియజేశామని సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కేసు సొరేన్ చుట్టూ బిగుస్తున్నా ఆయన చలించలేదు.గురువారం యధావిధిగా సెక్రటేరియట్ లో తన విధులకు హాజరయ్యారు.