జమ్ము కశ్మీర్‌లోని అనంత నాగ్ జిల్లాలో ఉగ్ర వేట కొనసాగుతోంది. జిల్లాలో 48 గంటలుగా ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయాలు అయ్యాయి. కాల్పుల్లో మరో జవాన్ మరణించగా కొన్ని గంటల పాటు ఆయన మృత దేహం దొరకలేదు. దీంతో జవాన్ మిస్సింగ్ అని అధికారులు తెలిపారు. తాజాగా ఆయన మృత దేహం లభ్యం అయినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో మరణించిన అధికారుల సంఖ్య నాలుగుకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 12న భద్రతా దళాలు, పోలీసులు కలిసి ఉగ్రవేట మొదలు పెట్టారు. గరోల్ గ్రామంలో ఉగ్రవాదులు ఉనికి ఉందన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవిలోని ఎత్తైన ప్రాంతంలో దాగి వున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్ ల నేతృత్వంలో భద్రతా బలగాలు అడవిని జల్లెడ పట్టాయి. మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఆ కాల్పుల్లో కల్నల్ సింగ్, మేజర్ ధన్ చోక్ సింగ్, డీఎస్పీ హిమన్యూన్ భట్ కు తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత చికిత్స పొందుతూ ఆ ముగ్గురు అధికారులు మరణించారు.
19 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు కమాండింగ్ అధికారిగా కల్నల్ మన్ ప్రీత్ సింగ్ పని చేశారు. గతంలో ఆయన సేనా మెడల్ (గ్యాలంటరీ) అవార్డు అందుకున్నారు. అదే యూనిట్ లో కంపెనీ కమాండర్ గా మేజర్ ధన్ చోక్ సింగ్ పని చేశారు. ఇక హిమన్యూన్ ముజామిల్ జమ్ము కశ్మీర్ లో డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.