Telugu News » KCR : మెడికల్ కాలేజీలు ప్రారంభం.. చరిత్ర సృష్టించామన్న సీఎం!

KCR : మెడికల్ కాలేజీలు ప్రారంభం.. చరిత్ర సృష్టించామన్న సీఎం!

కొత్తగా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు కేసీఆర్. 85 శాతం లోకల్ విద్యార్థులకే సీట్లు ఇస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు.

by admin
CM KCR

తెలంగాణ (Telangana) లో మరో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఎంబీబీఎస్ (MBBS) తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంబించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (CM KCR). ఎక్కడైతే వివక్షకు గురయ్యామో, ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోకుండా అష్టకష్టాలు పడ్డామో, ఎక్కడైతే కనీస వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయామో.. అదే గడ్డ మీద.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నామని అన్నారు సీఎం.

CM KCR Inaugurates 9 New Medical Colleges In Telangana

కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాలలో ఒకేరోజు ఈ మెడికల్ కాలేజీల తరగతులను ప్రారంభించారు. సొంత నిధులతో ఒకే ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం దేశంలో ఇంకెక్కడా జరగలేదన్నారు కేసీఆర్. దేశ వైద్య విద్య చరిత్రలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని తెలిపారు.

CM KCR Inaugurates 9 New Medical Colleges In Telangana 1

కొత్తగా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు కేసీఆర్. 85 శాతం లోకల్ విద్యార్థులకే సీట్లు ఇస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కాలేజీల ప్రారంభోత్సవ కార్యాక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గతేడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 9 స్టార్ట్ చేసింది. ఒక్కో కాలేజీలో వంద సీట్ల చొప్పున 900 ఎంబీబీఎస్ సీట్లు ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.

మంత్రి హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినమని అన్నారు. ‘‘ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి. ఇది సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గనిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించాం. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం. ఇది గొప్ప రికార్డు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి’’ అని అన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు హరీష్ రావు. ‘‘ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేది. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్ ది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ఆయనదే’’ అని వ్యాఖ్యానించారు హరీష్ రావు.

You may also like

Leave a Comment