ఇంద్రవెల్లి స్థూపాన్ని తాకే హక్కు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి లేదని మాజీ మంత్రి జోగు రామన్న(Ex Minister Jogu Ramanna) ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి సభలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ కుటుంబంపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
నాగోబా ఆలయానికి కేసీఆర్ నిధులు ఇస్తే రేవంత్ ప్రారంభోత్సవాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకుందని జోగు రామన్న ఆరోపించారు. సీఎం క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ప్రజా సంఘాల ఒత్తిడితో ఆ స్థూపం మళ్లీ నిర్మితమైందని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాకే స్థూపం దగ్గరకు వెళ్లే స్వేచ్ఛ దొరికిందని తెలిపారు.
శుక్రవారం ఐదు జిల్లాల పోలీసుల పహారాలో ఇంద్రవెల్లి సభ జరిగిందన్నారు. కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అవే మాటలను రేవంత్ మాట్లాడారని ఎద్దేవా చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి అవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌కు కేసీఆర్ హయాంలోనే నిధులొచ్చాయని గుర్తుచేశారు. 220కి పైగా తండాలు, గూడాలు, గ్రామ పంచాయతీలు అయ్యాయని తెలిపారు.
50ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదని జోగు రామయ్య అన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆవేదన చెందారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వివరాలు తెప్పించుకుని వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. బ్రోకర్ దందాలు చేసి రేవంత్ సీఎం కావడం ప్రజలు దురదృష్టం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.