కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలలో రెండు అమలు చేస్తున్నారు.. ఇంకా నాలుగు హామీల అమలుపై ప్రతిపక్షాలు అనుమానాలను లేవనెత్తుతోన్నారు. కాగా ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) క్లారిటీ ఇచ్చారు.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), అదానీని కలవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
దీనిపై కూడా స్పందించిన మంత్రి.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి అదానీని కలినట్టు తెలిపారు.. నేడు మీడియా సమావేశంలో పాల్గొన్న జూపల్లి.. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే బీఆర్ఎస్‌ను తరిమి కొట్టారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ (BRS) 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని.. అందులో ఒక్కటి కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదని అన్నారు..
గతంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్‌ను, ప్రత్యేక తెలంగాణ వచ్చిన రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. రెండేళ్ల పసికందును విమర్శిస్తారా? అని వాపోయినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం గులాబీ నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్టు ఉందని మండిపడ్డారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్‌కు ప్రజలు గడ్డి పెట్టారని ఎద్దేవా చేశారు.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలకే విమర్శలు ప్రారంభించారని జూపల్లి ఆగ్రహించారు.
2014లో ప్రజలు కేసీఆర్ చేతిలో బంగారు పళ్లాన్ని పెడితే.. తొమ్మిదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి కామ్ గా ఉన్నారని తెలిపారు.. కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీకే పోతోందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు అమలు చేశామని.. మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించామని జూపల్లి కృష్ణారావు వివరించారు.