ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు రాజకీయాలు అవసరమా అంటూ ఫైర్ అయ్యారు. షర్మిల (YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం అతి పెద్ద తప్పిదమని అన్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆమె డ్యాన్స్ చేయాల్సిందంటూ ఎద్దేవా చేశారు.
మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ… కేవలం ఆస్తులు, పదవుల కోసమే సోనియాకు షర్మిల తన పార్టీని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ను తిట్టడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం షర్మిల పని అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానని చెప్పారు. వాళ్లు ఇప్పుడు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని వెల్లడించారు.
ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందన్నారు. షర్మిలను ఏపీకి తీసుకువచ్చి నాశనం చేయాలనుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. దేశాన్ని సర్వ నాశనం చేసింది కాంగ్రెస్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీని సోనియా చంపేసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ మరణించినా ఆయన్ని సోనియా విడిచి పెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ పేరును చార్జిషీట్లో సోనియా పెట్టారని ఆరోపించారు. జగన్ను జైల్లో పెట్టారని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబాన్ని సోనియా గాంధీ వేధించారని మండిపడ్డారు. జగన్ అంటే ఇష్టం లేని వారు తమ పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో చేరాలని సూచించారు. కాంగ్రెస్లో ఎవరూ జాయిన్ కావద్దన్నారు. ప్రజాశాంతిని విలీనం చేస్తే తనకు సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారన్నారు.
తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది డిసెంబర్ 25న తనను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. క్రిస్మస్ పండుగ నాడు తనకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యేలా చేశారన్నారు. ప్రస్తుతం తాను విశాఖపట్నంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని వెల్లడించారు. దేవుడి దయవల్ల ఫుడ్ పాయిజన్ నుంచి తాను బతికి బయట పడ్డానన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరిగిందన్నారు.