తెలంగాణ (Telangana) అసెంబ్లీ (Assembly) బడ్జెట్ సమావేశాలు (Budget Meetings) వాడిగా వేడిగా కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) సీరియస్ అయ్యారు. బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి సభలో లేరన్నారు. కీలక సమయంలో ఇద్దరూ లేకపోవడం ప్రభుత్వ తీరు ఎలా ఉందో తెలియచేస్తోందని విమర్శించారు.
కీలక సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని వెల్లడించారు. సభ నిర్వహణలో ప్రభుత్వానికి తగిన శ్రద్ధ లేదని మండిపడ్డారు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని వీటికి కాంగ్రెస్ (Congress) బాధ్యత వహించాలన్నారు.. దేశాన్ని చాలా ఏళ్లు పాలించామని చెప్పుకొంటున్న కాంగ్రెస్.. నేటి పరిస్థితులకు కారణమన్న విషయాన్ని మరచిందని కడియం శ్రీహరి ఆరోపించారు..
మరోవైపు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు.. కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేసిన కడియం.. మలిదశ ఉద్యమ నాయకులు కేసీఆర్ ను మరిచిపోవడం బాధాకరమని తెలిపారు. తెలంగాణ మలి దశ ఉద్యమం 2001లో చేశారన్నారు. ఆసమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తుచేశారు.. కాంగ్రెస్ తెలంగాణకు న్యాయం చేయట్లేదని అందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని తెలిపారు.
నియంతృత్వ, నిర్భంధ పోకడలు ఉన్నాయంటున్న వారే.. ఎమర్జెన్సీ విధించిన విషయం మరిచిపోయారా అని కాంగ్రెస్ కు చురకులు అంటించారు. ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 404 స్థానాలు గెలుచుకుందని.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యమని చెప్పినా 40 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చేట్లు లేదని కడియం శ్రీహరి విమర్శించారు.