రాష్ట్ర గవర్నర్ (Governor) తమిళిసై సౌందర్ రాజన్ (Tamilisai Soundar Rajan)పై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లు ఉందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన కడియం శ్రీహరి.. ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంలో కొత్తదనం లేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నది మరిచిపోయిన గవర్నర్.. గత పది సంవత్సరాలుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు ప్రసంగంలో పేర్కొనడం చిత్రంగా ఉందని కడియం శ్రీహరి వెల్లడించారు.. తెలంగాణ వరి ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్నిముందు నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేసిన కడియం శ్రీహరి.. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది నిజం కాదా? ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది అబద్ధమా? అని ప్రశ్నించారు.
తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari).. పలువిషయాల్లో గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ 2014లోనే నిర్బంధం నుంచి విముక్తి అయింది. ఇప్పుడు కావడమేమిటి అని కడియం ప్రశ్నించారు. మరోవైపు గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదని తెలిపారు.
గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావన రాలేదు ఎందుకని ప్రశ్నించిన శ్రీహరి.. మద్దతు ధరకు రూ. 500 కలిపి ధాన్యం కొనుగోలు చేస్తామన్న అంశం పై కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించ లేదని ఆరోపించారు.. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కనబడడం లేదని కడియం శ్రీహరి అనుమానం వ్యక్తం చేశారు..