ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేశ్(Aruri Ramesh) చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలకు రాజ్యాంగంపై అవగాహన లేదని విమర్శించారు. పదేళ్ల మోడీ పాలనలో చేసిందేమీ లేదు కాబట్టే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తన కూతురు వరంగల్‌లో పుట్టిందని, ఇక్కడే ఉద్యోగం చేసిందన్నారు. తన క్లాస్‌మెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుందని, ఆమె చదువుల్లో ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకుందని తెలిపారు. 2017లో సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వల్లే ఇది సాధ్యమని తెలిపారు. మతం మారినంత మాత్రాన కులం మారదని స్పష్టం చేశారు.
పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందని, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌ను అనుసరించి తన కూతురు పెళ్లి చేసుకుందని తెలిపారు. ఆరూరి రమేశ్ ఒకప్పుడు తన దగ్గర సాధారణ కార్యకర్తగా ఉంటే ఆయన్ను క్లాస్ వన్ కాంట్రాక్టర్‌ను చేశానని అన్నారు. అంతేకానీ ‘రమేశ్ ఎప్పుడైనా నాకు డబ్బులు ఇచ్చావా.. దమ్ముంటే నిరూపించు.. ఓపెన్ చాలెంజ్’ అంటూ కడియం సవాల్ విసిరారు.
తన ద్వారా ఎదిగిన ఆరూరి రమేశ్ తనకే వెన్నుపోటు పొడిచాడని కడియం ఆరోపించారు. పార్టీ మారిన వ్యక్తి తన గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మంద కృష్ణ మాదిగ కేవలం తన ఒక్కడి వెంట పడడానికి కారణం ఏంటో అర్థం కావడంలేదన్నారు. మాదిగలకు ద్రోహం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణమాదిగ అని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటోందని తెలిపారు. రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇటీవల వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఓ ప్రెస్మీట్లో కడియంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కావ్యకి ఈ ప్రాంతంతో ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని ఆరూరి రమేశ్ డిమాండ్ చేశారు. ఆమె కడియం కావ్య కాని, మహమ్మద్ కావ్య నజరుద్దీన్ అని చెప్పుకొచ్చారు. ఆమె అత్తగారి ఊరు గుంటూరు అని, అక్కడి వాళ్లను వరంగల్ పార్లమెంట్ టికెట్ అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు కడియం కౌంటర్ ఇచ్చారు.