Telugu News » Kaleshwaram : మేడిగడ్డ ఖాళీ.. ఇది కేసీఆర్ కుటుంబ పాపమే: రేవంత్ !

Kaleshwaram : మేడిగడ్డ ఖాళీ.. ఇది కేసీఆర్ కుటుంబ పాపమే: రేవంత్ !

క్రమ క్రమంగా పలు గేట్లను ఎత్తుతూ జలాశయంలోని నీటిని విడుదల చేశారు.

by Ramu

కాళేశ్వరం (Kaleshwaram) మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి (Laxmi Barrage) వంతెన కుంగి పోవడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెనలోని 20వ పిల్లర్ బేస్ మెంట్ దెబ్బ తిన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జలాశయాన్ని ఖాళీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనులు చేపట్టారు. క్రమ క్రమంగా పలు గేట్లను ఎత్తుతూ జలాశయంలోని నీటిని విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం బ్యారేజీలో కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

వంతెనలోని 19,20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో వంతెనను ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతి రావు. ఇతర అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్ష చేపట్టారు. అనంతరం మహారాష్ట్రలోని సిరోంచ, భూపాలపల్లిలోని మహదేవ పూర్ పోలీసులకు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు ఫిర్యాదు చేశారు.

శనివారం సాయంత్రం 6.20 నిమిషాల సమయంలో వంతెన వద్ద పెద్ద ఎత్తున శబ్దం వినిపించిందని అధికారులు తెలిపారు. వెంటనే తాము ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్టు ఫిర్యాదులో అధికారులు వెల్లడించారు. బ్లాక్ నెంబర్ 7లోని 19, 20, 21 పిల్లర్ల దెబ్బ తిన్నట్టుగా గుర్తించామన్నారు. అదే సమయంలో మహారాష్ట్ర వైపు ఉన్న పిల్లర్ 20 పై గోడలు కూడా దెబ్బ తిన్నట్లు గుర్తించామన్నారు.

ఈ ఘటన వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్టు తమకు అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపాలని పోలీసులను కోరారు. ఇక మేడిగడ్డ లక్ష్మీ ప్రాజెక్టు కుంగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటనకు నాణ్యత లోపమే కారణమన్నారు. గొప్ప ఇంజనీర్ గా చెప్పుకుంటూ రూ.లక్ష కోట్లను సీఎం కేసీఆర్ వృథా చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కల్వకుంట్ల కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా బలైపోయిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టుకు డిజైన్‌ కు తానే రూపకల్పన చేశానని కేసీఆర్ చాలా సార్లు చెప్పుకున్నారని గుర్తుచేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగినట్టు రాహుల్‌ గాంధీ ఎన్నోసార్లు చెప్పారన్నారు. ప్రాజెక్టుపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ తో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ఆయన డిమాండ్ చేశారు.

ఇది ఇలా వుంటే బ్యారేజీ కుంగుబాటుపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సీ చీఫ్‌ ఇంజినీర్‌ నల్లా వెంకటేశ్వర్లు స్పందించారు. ఈ ఘటనపై నిపుణులు సమీక్ష జరుపుతున్నారని పేర్కొన్నారు. బ్యారేజి డిజైన్​లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. అడుగున్నర మేర బ్యారేజి కుంగు పోయిందన్నారు. దీంతో నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. బ్యారేజీకి త్వరలోనే మరమ్మతులు చేపడతామని తెలిపారు.

You may also like

Leave a Comment