తెలంగాణలో ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై వాడీ వేడి చర్చ జరుగుతోంది. శ్వేత పత్రంపై చర్చ సందర్బంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం నిట్ట నిలువునా చీలిందని అన్నారు. గతంలో హరీశ్ రావుకు కాళేశ్వర్ రావు అని గవర్నర్ పేరు పెట్టారని తెలిపారు.
ఇప్పుడు కూలిన దానికి తప్పు ఒప్పుకోవాలని సూచించారు. కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు… అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా పోతాయని ఎన్డీఎస్ఏ చెప్పిందని పేర్కొన్నారు. తాము జ్యోతిష్యం చెప్పడం లేదని… అవి నిపుణులు చెప్పిన మాటలని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మనం ఇల్లు కట్టుకుంటేనే ఓ మంచి ఇంజనీర్‌ను పెట్టుకుంటామన్నారు.
అలాంటిది గతంలో కాళేశ్వరం తానే కడతానని చెప్పి కేసీఆర్ ఏం చేశారో మనం ఇప్పుడు చూస్తున్నామన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో పని ఎందుకు చేయించలేదు అని నిలదీశారు. రాజీవ్ సాగర్, దేవాదుల, ఎస్ఆర్ఎస్‌పీ పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది వదిలేసి.. లక్ష 72 వేళ కోట్లకు పెంచి కాళేశ్వరం కట్టారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తాము తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకున్నామని వివరించారు. అందుకే తాము మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని స్పష్టం చేశారు. కానీ మహారాష్ట్ర దానికి అభ్యంతరం చెప్పిందన్నారు.. కానీ, బీఆర్ఎస్ మాత్రం 152 మీటర్ల ఎత్తులో ఉన్న చోట ప్రాజెక్టు కట్టడానికి ఒప్పుకుందని…ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. చివరికి 100 కిలోమీటర్ల కిందికి వచ్చి కాళేశ్వరం కట్టారని ఎద్దేవా చేశారు.