Kamalnath : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ 42 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రజల్లో 42 గ్రూపులను గుర్తించి కాంగ్రెస్ విజయానికి అవి కృషి చేసేలా తమ వంతు కృషి చేస్తాయి. ఆశ్చర్యమేమిటంటే ఈ కమిటీ ఒకొక్కటి ఒక్కో సైనికునిలా పని చేస్తుంది. విదిష జిల్లాలోని సిరొంజీ టౌన్ కి వెళ్తే అక్కడ ఓ సెలూన్ లో పాలిటిక్సే ప్రధాన అజెండా అవుతుంది. ఈ సెలూన్ లో పని చేసే ఇద్దరు సోదరులు తమవద్దకు వచ్చే కస్టమర్లకు మంచి మంచి రాజకీయ సలహాలిస్తారు. సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chouhan) ప్రభుత్వ వైఫల్యాలను పూస గుచ్చినట్టు వివరిస్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ మార్పు ప్రభావాన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారో, ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో కళ్ళకు కట్టినట్టు చెప్పడమే వారి పని. వీరి సెలూన్ ..కేశ్ కళా శిల్పి ప్రకోషిత్ అని వ్యవహరించే 42 కమిటీల్లో ఒకటి.
ఇలాగే వివిధ గ్రూపుల్లో ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు, సామాన్యులు, అణగారిన వర్గాల వారు ఉన్నారు. ఒక్కో గ్రూప్ లోని సభ్యులతో కాంగ్రెస్ సీనియర్ నేత జె.పి. ధనోపియా ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆయన ఈ కమిటీల కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. 2018 లో ఈ విధమైన కమిటీలు ఏర్పాటైనా.. 2020 లో ప్రభుత్వ పతనంతో అవి తెరమరుగైనా.. మళ్ళీ ఇప్పుడిప్పుడే కమల్ నాథ్ ఆధ్వర్యంలో పని చేయడం ప్రారంభిస్తున్నాయని ధనోపియా తెలిపారు.
5 నెలల క్రితమే మెకానిక్స్, లేబరర్స్ తో కూడిన కమిటీ కూడా ఏర్పాటయిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలనూ నేరుగా కాకుండా ఇలా విడివిడిగా కలుసుకోవడమే ఈ కమిటీల లక్ష్యమని కమల్ నాథ్ వెల్లడించారు. మేకలు, గొర్రెల కాపరులు, పూజారులు, డాక్టర్లు.. ఇలా అన్ని వర్గాలతోనూ తాము మమేకమవుతామన్నారు.
230 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సీట్ల శాతం కేవలం 5 మాత్రమే.. అందువల్లే.. జరగబోయే ఎన్నికల్లో ఈ పార్టీ బీజేపీకి చెక్ పెట్టి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంపాదించడానికి యత్నిస్తోంది.