బీజేపీ(BJP) అధిష్టానం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ లోక్ సభ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) కు హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ నేతలు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ పక్ష నేత విజయ్ వాడేట్టివార్ ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు.
బీఫ్(గొడ్డు మాంసం) తినడాన్ని ఇష్టపడతానని కంగనానే ఓసారి ట్వీట్లో పేర్కొందంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఆరోపణలను తాజాగా కంగనా ఎక్స్ వేదికగా స్పందించింది. తాను బీఫ్(Beef) తినని స్పష్టం చేసింది. తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది కంగనా. తాను హిందువుగా గర్వపడుతున్నానని తనపై వస్తున్న నిరాధారమైన రూమర్స్‌ను వ్యాప్తి చేయడం సిగ్గుచేటని ట్వీట్లో పేర్కొంది.
అదేవిధంగా తాను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని సమర్థిస్తున్నానని, వాటిని ప్రచారం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఆరోపణలు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి పనిచేయవని తెలిపింది. తన గురించి ప్రజలకు బాగా తెలుసని, తాను హిందువునని చెప్తూ చివరగా జైశ్రీరాం అంటూ నినదించింది. మరోవైపు ఏప్రిల్ 5న మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో వాడెట్టివార్ మాట్లాడుతూ.. అవినీతి నాయకులందరికీ బీజేపీ స్వాగతం చెబుతోందని విమర్శించారు.
బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే మాట్లాడుతూ.. వాడేట్టివార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ మురికి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. సమస్యలపై కాంగ్రెస్ తమతో పోరాడటం లేదని, ఇది పార్టీ ఓటమి మనస్తత్వాన్ని చూపుతోందని అన్నారు. ఇదిలా ఉండగా కంగనా 2019 మే 19న గొడ్డుమాంసం తినడం తప్పుకాదని, దానికి మతంతో సంబంధం లేదని ట్వీట్ చేశారు. మళ్లీ ఇప్పుడేమో తాను బీఫ్ తిననంటూ అందుకు భిన్నంగా చెప్పుకొచ్చారు. ఇలా ఆమె రెండు రకాల ట్వీట్లను పోలుస్తూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.