పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ (Modi), చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే మీ మంగళ సూత్రాలను కూడా తీసుకెళ్లి అమ్ముకుంటారని విమర్శలు గుప్పించారు. అయితే ఈ మాటలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.. ఇలాంటి వ్యాఖ్యలు ప్రధాని చేస్తారని అసలు ఊహించనట్లు కర్ణాటక (Karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ దేశ సంస్కృతిని కాపాడుతుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు. అలాగే మంగళసూత్రం అనేది ప్రతీ మహిళ జీవితంలో ఒక భాగం అని, దానిని మేము గౌరవిస్తామని, మహిళల హక్కులను కాపాడుతామని పేర్కొన్న శివకుమార్.. దేశం కోసం, దాని సమగ్రత కోసం తన తల్లి సోనియా గాంధీ మంగళసూత్రాలను కోల్పోయారని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆవేదనతో అన్నారని గుర్తు చేశారు.
మరోవైపు మంగళసూత్ర వ్యాఖ్యలకు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సైతం కౌంటర్ ఇచ్చారు.. పెరుగుతున్న ధరల కారణంగా చాలామంది మహిళలు బంగారం కొనలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు, కరోనా మహమ్మారి సమయంలో, పుల్వామా ఉగ్రవాద దాడి, సరిహద్దుల్లో చైనా (China) సైనికులతో జరిగిన ఘర్షణల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
ఇలా మరణించిన వారి మహిళల మంగళసూత్రాలకు ఎవరు బాధ్యత వహించాలో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు.. ఎన్నికల సమయంలో ప్రజలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడాలని తెలిపిన తేజస్వి యాదవ్.. మోడీ మంగళసూత్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దేశంలోని చాలామంది మహిళలు బంగారం కొనలేని స్థితిలో ఉన్నారని ఆయనకు తెలియదా అని విమర్శించారు..