కార్తీక మాసం(Karthika Masam) ఆఖరి సోమవారం(Last Monday) కావడంతో ఇవాళ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక సోమవారం భక్తులు పుణ్యదినంగా భావిస్తారు. అధిక మంది భక్తులు శైవక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ఉదయాన్నే నదుల్లో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు. ముక్కంటి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగాధర మండలం ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. స్వామివారి దర్శనానికి 5గంటల సమయం పడుతోంది.
మరోవైపు విజయవాడ కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గాఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపు కోట పుణ్యగిరి శ్రీ ఉమాకోటి లింగేశ్వర ఆలయం, సన్యాషేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
అదేవిధంగా భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. 365ఒత్తులు వెలిగించి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సోమగుండం చెరువులో దీపాలను వదులుతున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. ఇక్కడ శివలింగం ప్రతీ పౌర్ణమికి శ్వేతవర్ణంలోనూ, అమావాస్యకి గోధుమ రంగులో మారి భక్తులకు దర్శనమిస్తుంది.