జ్యోతిరావ్ ఫూలే భవన్లో స్వీకరిస్తున్న అర్జీల ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక్క రోజు మాత్రమే పాల్గొన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. సభ, కార్యక్రమం పేరుతో ఎంత ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో రేవంత్‌కు ఏమాత్రం పోలిక లేదని ఎద్దేవా చేసిన కవిత (Kavitha).. ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మంచిదే అన్నారు. కేసీఆర్ (KCR) కోరుకున్నది కూడా ఇదే అని తెలిపిన ఆమె.. ఆయన చూపిన మార్గంలో సీఎం నడుస్తుండటం సంతోషించదగ్గ విషయమని హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని ప్రస్తావించిన అంశంపై మండిపడ్డారు.. మహిళకు త్వరలో రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపిన సీఎం.. ఈ కార్యక్రమాన్ని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చేతుల మీదుగా మొదలుపెడతామని వెల్లడించారు. ఈమేరకు ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఏ హోదాతో పిలుస్తారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు..
అసెంబ్లీ ఆవరణంలో పూలే విగ్రహం పెడతారా లేదా అని ప్రశ్నించిన కవిత.. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ జనగణన చేపడతామని హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదన్నారు. కేంద్రం బడ్జెట్ పెట్టి రెండు రోజులు గడుస్తున్నా రాష్ట్రానికి కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.