తెలంగాణ ఎన్నికలలో ఇప్పటి వరకు ప్రభుత్వం తీరుతెన్నులు వెలుగులోకి వచ్చాయని అనుకుంటున్నారు.. ప్రచారంలో నేతల మాటలు గమనిస్తున్న వారు.. మరోవైపు ఎన్నికల ప్రచారంలో దేశాన్ని ఓ కుదుపు కుదిపిన లిక్కర్ స్కామ్ ( Liquor Scam)కేసు గురించిన టాపిక్ వచ్చింది.. సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ (Anurag Singh Thakur) లిక్కర్ స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన అనురాగ్ సింగ్.. లిక్కర్ కేసు ఇంక పూర్తి కాలేదు.. ఈ స్కామ్ తో సంబంధం ఉన్న వారందరూ కవితతో సహా శిక్ష అనుభవించవలసిందేనని పేర్కొన్నారు. తెలంగాణను ఒక వైపు కేసీఆర్ (KCR) ఫ్యామిలీ.. మరో వైపు అల్లుడు హరీష్ రావు దోచుకుంటుంటే ఇంకా ఎక్కడ బాగుపడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో 10 ఏండ్ల నుంచి ఒక్కటే కుటుంబం బాగుపడ్డదని ఆరోపించిన అనురాగ్ సింగ్.. కేసీఆర్ పాలన మొత్తం అవినీతి ఊబిలో కురుకు పోయిందని మండిపడ్డారు..
అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో లక్ష ఉద్యోగాలు వచ్చాయా? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా? అని అనురాగ్ సింగ్ ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులను తాము ఇచ్చినట్టుగా చెప్పుకొంటూ బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించిన అనురాగ్ సింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.. రజాకార్ల పాలన నుంచి వల్లభాయ్ పటేల్ తెలంగాణకు విముక్తి కల్పిస్తే.. దొరలు పాలిస్తూ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని అనురాగ్ సింగ్ విమర్శించారు.
రాష్ట్రంలో ఏ పథకం అమలు చేసిన బీఆర్ఎస్ (BRS)కు కమిషన్లు ముట్టవలసిందే అని ఆరోపణలు చేశారు.. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం రైతులకు యూరియా, ఎరువులను చౌకగా అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణతో పోలిస్తే మిగతా రాష్ర్టంలో పెట్రోల్ చౌకగా లభిస్తుందన్న అనురాగ్ సింగ్.. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తాం అన్నారు. కుల మతాలకు అతీతంగా మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు.