పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాము ఇంకా స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లలేదని.. యాక్టివ్ మోడ్ లోనే ఉన్నామని ప్రజలకు తెలిసేలా.. గులాబీ బాస్ రంగంలోకి దిగారు.. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పొలాల బాట పట్టారు.. ముగ్దుంపూర్లో పర్యటించిన ఆయన ఎండిన పంటలను పరిశీలించారు. రైతులను నీటి సమస్యపై అడిగి తెలుకొన్నారు.
ఈ క్రమంలో రైతులు ధైర్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ (BRS) అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ (KCR) హామీ ఇచ్చారు. అలాగే పలువురు రైతులు ఆయనకు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
అనంతరం చొప్పదండి (Choppadandi) నియోజకవర్గంలోని బోయినపల్లిలో రైతులతో ముచ్చటించారు. ఎండిన పంట పొలాలను పరిశీలించారు. తర్వాత మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి నుంచి వేములవాడ, సిరిసిల్ల (Sircilla) నియోజకవర్గాల్లో పర్యటనకు బయలు దేరారు.. కాగా ఇక్కడి బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. అలాగే ఎండిన పంటలను పరిశీలించి రైతుల గోడును అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత పదివేల మంది రైతులతో మేడిగడ్డను ముట్టడిస్తామని ప్రకటించారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని, పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం శభాష్ పల్లి వద్ద మానేరు జలాశయాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా కేసీఆర్, కరీంనగర్ పర్యటనలో జేబు దొంగలు హల్ చల్ చేశారు. ఓ నాయకుడి జేబులో నుంచి రూ.10 వేలు కొట్టేశాడు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ దొంగను పట్టకొన్నారు.