– చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్
– బెంజ్ కారులో ఎంట్రీ
– ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం
– ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు
– ఉత్సాహంలో గులాబీ శ్రేణులు
కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సీఎంగా రెండుసార్లు పదవి చేపట్టిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలకు ఇన్నాళ్లూ దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. చాలా రోజుల తర్వాత గులాబీ బాస్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైట్ కలర్ కొత్త బెంజ్ కారులో ఎంట్రీ ఇచ్చిన ఆయనకు గులాబీ శ్రేణులు స్వాగతం పలికారు.
చేతి కర్ర పట్టుకొని వచ్చిన కేసీఆర్ వెంట.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తదితరులు ఉన్నారు. అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా.. కేసీఆర్ చేత స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు.
మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిసెంబర్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. మరికొందరు స్పీకర్ ప్రసాద్ సమక్షంలో అసెంబ్లీలో చేశారు. కానీ, తుంటి ఎముక ఆపరేషన్ కారణంగా ఇంటికే పరిమితమైన కేసీఆర్.. ఇప్పటిదాకా చేయలేదు.
ఈ నేపథ్యంలో గురువారం ఆయన అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఆర్ ఎంట్రీ కోసం ఇన్ని రోజులుగా ఆశతో ఎదురుచూసిన గులాబీ నేతలకు ఆయన రాకతో జోష్ వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గులాబీ బాస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో ఆనేది ఆసక్తికరంగా మారింది.