వేసవిలో నిప్పులు కక్కుతున్న భానుడల్లే బీఆర్ఎస్ (BRS) పై కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అవినీతి పై గళం విప్పిన హస్తం.. బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా చార్జిషీట్ విడుదల చేసింది. మొత్తం పది అంశాలతో కూడిన ఈ చార్జిషీట్‌లో కేసీఆర్ (KCR) పాలన, బీఆర్ఎస్ హామీలపై ధ్వజమెత్తింది. విద్యా రంగానికి అతి తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించేది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డ కాంగ్రెస్.. ఈ రాష్ట్రం కంటే దేశంలోని మిగతా రాష్ట్రాలు నయం అని ఎద్దేవా చేసింది.
కేజీ టు పీజీ ఉచిత విద్యను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ గడిచిన 9 ఏళ్లలో కొత్తగా ఒక్క తరగతి గదిని కూడా రాష్ట్రంలో నిర్మించలేదని దుయ్యబట్టింది. 2014-15 బడ్జెట్‌లో విద్యారంగానికి 10.89 శాతం నిధులు కేటాయిస్తే క్రమంగా తగ్గిస్తూ 2023-24 బడ్జెట్‌లో 7.6 శాతానికి బీఆర్ఎస్ ప్రభత్వం తీసుకువచ్చిందని ఆరోపించింది.
సీఎస్ఆర్ నిధులతో ఒక కేజీ టు పీజీ సంస్థను గంబీరావుపేటలో నిర్మించిన ప్రభుత్వం.. కనీసం ఒక్క పాఠశాలనైనా నిర్మించమని కార్పొరేట్ కంపెనీలను అడుక్కునే స్థితికి దిగజారిదని కాంగ్రెస్ (Congress) ఆరోపించింది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో కేసీఆర్ యువతను మోసం చేశాడని.. టెన్త్ ఎగ్జామ్స్ నుంచి టీఎస్‌పీఎస్సీ వరకు అన్ని పరీక్షల నిర్వహణలో ఈ ప్రభుత్వం విఫలమైందని చార్జిషీట్ (Charge sheet)లో పేర్కొంది..
ఈ ప్రభుత్వం కారణంగా 2014-2021 మధ్య దాదాపు 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు ఫీజు రియంబర్స్‌మెంట్ బాకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా కాలేజీల నిర్వహకులు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని చార్జిషీట్ లో కాంగ్రెస్ పేర్కొంది.
ప్రభుత్వ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా.. తన సన్నిహితులకు లబ్ది చేకూర్చేలా ప్రైవేట్ యూనివర్సీటీలను సీఎం ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కేసీఆర్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలోని యువత మద్యం, జూదం, డ్రగ్స్‌కు బానిసలయ్యారని వారి భవిష్యత్ నాశనం అవుతున్నదని చార్జిషీట్‌లో పేర్కొంది..