– కేసీఆర్ షాకింగ్ నిర్ణయం
– ఈనెల 4న కేబినెట్ భేటీ
– 3న ఎన్నికల ఫలితాలు
– రిజల్ట్స్ తర్వాతి రోజే మంత్రివర్గ సమావేశం
– ఇది గెలుస్తామని విశ్వాసమా?
– లేక, ఓడిపోతామని అపనమ్మకమా?
సీఎం కేసీఆర్ (CM KCR) చర్యలు ఒక్కోసారి ఊహాతీతంగా ఉంటాయి. తాజాగా కేబినెట్ సమావేశంపై తీసుకున్న నిర్ణయం అంతే. తెలంగాణ అంతటా గురువారం ఎన్నికలు జరిగాయి. ఈనెల 3న (ఆదివారం) కౌంటింగ్ జరగనుంది. దీనికోసం ఎలక్షన్ కమిషన్ (Election Commission) ఓవైపు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇంకోవైపు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. అదికూడా, ఎన్నికల ఫలితాల తర్వాతి రోజే. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఈనెల 4న అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ సమావేశం ఉంటుందని సీఎంవో (CMO) ఓ ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు వెల్లడి అయ్యే ఒకరోజు తర్వాత కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది గెలుస్తామని విశ్వాసమా.. లేక, ఓడిపోతామని అపనమ్మకమా? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే సీట్లు ఎక్కువ వస్తాయని తేలింది. ఇదే సమయంలో హంగ్ వార్తలు కూడా వస్తున్నాయి. గులాబీ నేతల్లో చాలామందికి ఓటమి తప్పదని తేలిపోయింది. పైగా, కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారో అనే డౌట్ ఉంది. ఇలాంటి సమయంలో ఫలితాల తర్వాతి రోజే.. కేసీఆర్ కేబినెట్ భేటీకి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు కేసీఆర్. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై చర్చించి.. నేతలకు భరోసా ఇచ్చారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టబోతుందని.. ధైర్యంగా ఉండాలని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుముందు, పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై ప్రాథమిక స్థాయిలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కలిసి చర్చించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ను కలిసి మాట్లాడారు.