ఇండో-ఏషియన్ సర్వీసెస్ కోసం సీ ఓటర్ చేపట్టిన యాంగర్ ఇండెక్స్ సర్వే వెల్లడించిన విషయాలు గులాబీ బాసు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్య మంత్రుల జాబితాలో సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారని సర్వే వెల్లడించింది. దేశంలో అత్యంత ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న నేతగా సీఎంగా నిలవడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
తెలంగాణ సీఎంతో పాటు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని ఈ సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 50.2 శాతం ఓటర్లు సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ఓటర్లు కోరుకుంటున్నట్టు సర్వే తెలిపింది. సర్వే ప్రకారం….
సీఎం కేసీఆర్ తర్వాత అత్యధిక మంది ఓటర్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై తీవ్ర ఆగ్రహంతో వున్నారు. రాష్ట్రంలో 49.2 శాతం ఓటర్లు గెహ్లాట్ పై రగిలి పోతున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ పై 35.1 శాతం ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. మిజోరాం సీఎం జోరాంతంగాపై 37.1 శాతం ఓటర్లు, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై 27 శాతం ఓటర్లు వ్యతిరేకత కలిగి వున్నారు.
ఇక దేశంలో అతి తక్కువ ప్రజాగ్రహం కలిగిన నేతగా సీఎం భూపేశ్ పటేల్ నిలిచారు. ఆయనపై కేవలం 25.4 శాతం ఓటర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇలా వుంటే తెలంగాణ త్వరలో జరగబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. వారిలో అత్యధికంగా సిట్టింగ్ లకే అవకాశం కల్పించారు.
ఆ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 27.6 శాతం ఓటర్లు వ్యతిరేక భావనతో ఉన్నట్టు సర్వే చెప్పింది. సీఎం కేసీఆర్ తో పోలిస్తే సిట్టింగ్‌లపై వ్యతిరేకత తక్కువగా ఉండడం ఆసక్తి కలిగించే అంశం. త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ సర్వే వివరాలు గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.