ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కస్టడీపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు కేజ్రీవాల్ అరెస్టుకు గల కారణాలను ఈడీ(ED) తరఫు న్యాయవాదులు జోహెబ్ హొస్సైన్, ఏఎస్జీ (అడిషనల్) సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు వివరించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ స్కామ్‌లో కింగ్ పిన్ అని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ సూచనల మేరకే మోసాలన్నీ జరిగాయన్నారు. ఆయనకు పది రోజుల రిమాండ్‌కు ఈడీ కోర్టును కోరారు. మద్యం పాలసీని సౌత్ గ్రూపునకు అనుకూలంగా తయారు చేయడం, అమలు చేయడంలో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా భాగమయ్యారని వెల్లడించారు.
ఈ స్కాం ద్వారా వచ్చిన సొమ్మును ఖర్చు పెట్టే పనిలో కేజ్రీవాల్ నిమగ్నమయ్యారని కోర్టుకు వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో మీడియా ఇన్చార్జిగా ఉన్న విజయ నాయర్ సీఎం కేజ్రీవాల్ ఇంటి పక్కనే ఉండేవారని, అక్కడి నుంచే తరచుగా సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చేవారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, సౌత్ గ్రూప్‌కు మధ్యలో అనుసంధానకర్తగా విజయ్ నాయర్ వ్యవహరించారని తెలిపారు.
సౌత్ గ్రూపుకు చేసిన మేలు (ప్రయోజనం)కు ప్రతిఫలంగా కేజ్రీవాల్ ముడుపులు డిమాండ్ చేశారని, లిక్కర్ మాఫియా కేసులో అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి చెప్పిన వివరాలు ఎస్వీ రాజు వివరించారు. సౌత్ గ్రూపు నుంచి సమీకరించిన కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని తెలిపారు.
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన 24గంటల లోపే కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఆయనను అరెస్టు చేశామని కోర్టుకు వివరించారు. అరెస్టుపై ఆయన బంధువులకు సమాచారం అందించామని, రిమాండ్ అప్లికేషన్ కాపీని ఆయనకు అందజేసి అరెస్టుకు గల కారణాలను తెలిపి డాక్యుమెంట్లను అందజేసినట్లు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.