ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ బెయిల్ పై బయటకి రావడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ఆయనకు ఢిల్లీ హైకోర్టు (High Court) షాకిచ్చింది. ఈ స్కామ్ లో అరెస్ట్ చేయడానికి ఈడీ (ED) వద్ద తగినంత ఆధారం ఉందని తెలిపిన కోర్టు, కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
అదేవిధంగా కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి దారితీసిన తగినంత సమాచారం, ప్రూఫ్స్ ఈడీ వద్ద ఉన్నాయని.. అలాగే పిలిచినప్పుడు విచారణకు హాజరుకాకపోవడం వల్ల జరిగిన జాప్యంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారిపై కూడా ప్రభావం చూపిందని తెలిపింది.. ఈ ఘటనలు పరిశీలించిన తర్వాత కేజ్రీవాల్ అరెస్టు అవసరంపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.
మరోవైపు తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని లోక్‌సభ ఎన్నికల వేళ ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ముఖ్యంగా కోర్టు రాజకీయాల జోలికి వెళ్లవని.. అరెస్టు సమయాన్ని ఈడీ నిర్ణయించినట్లు తాను భావించబోమని పేర్కొంది. కేసు ఏదైనా అందులోని నిందితుల అరెస్ట్, చట్ట ప్రకారం పరిశీలించి చేయాల్సి ఉంటుందని.. ఎన్నికల సమయం ప్రకారం కాదని స్పష్టం చేసింది.
చట్టంలో అందరికీ సమానంగా న్యాయం ఉంటుందని, వివిధ కేటగిరీలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే ఆప్ అధినేతను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఉత్తర్వుతో సహా ట్రయల్ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కూడా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సమర్థించారు. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ పాత్ర లిక్కర్ పాలసి రూపకల్పన, మనీలాండరింగ్ వ్యవహారంలో ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది.. కాగా ఈ కేసులో సీఎం ప్రమేయం లేకున్నా అరెస్ట్ చేశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే..