తెలంగాణ (Telangana) ప్రజలు కాంగ్రెస్ బాధ్యతను పెంచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ముందు ఉంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని వెల్లడించారు. తాను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లామన్నారు. పార్టీ సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు.
డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని అన్నారు. అదే రోజున ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారన్నారు. ప్రతిపక్షంగా పార్టీగా కొత్త ప్రభుత్వానికి బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితిలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. తమ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు.
ఇకపై ప్రగతి భవన్ పేరును మారుస్తామని, డాక్టర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌గా మారుస్తామన్నారు. ప్రజాభవన్‌లోకి సామాన్యులందరికీ ప్రవేశం ఉంటుందన్నారు. సచివాలయం గేట్లు కూడా అందరికి తెరుచుకుంటాయని స్పష్టం చేశారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
‘ఈ గెలుపు తెలంగాణ ప్రజలది. కాంగ్రెస్‌కు విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు. ఏ సమస్యలు వచ్చినా అన్ని విధాలుగా మాకు సహకరించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. తెలంగాణతో మాది కుటుంబ అనుబంధమని ప్రజల్లో రాహుల్ గాంధీ విశ్వాసం నింపారు. రాహుల్ గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేకు ధన్యవాదాలు . ఈ విజయంలో తన పాత్ర పోషించిన విజయశాంతికి ఆయన కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు.