తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతుంది. ఎక్కడ మీటింగ్ జరిగిన కేసీఆర్ (KCR) సీఎం (CM)గా ఉంటేనే తెలంగాణ అభివృద్థి.. అనే టెక్నిక్ పదే పదే ఉపయోగిస్తుంది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ (KTR) మరో సారి వెల్లడించారు. జలవిహార్ (Jalavihar)లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల సేవలను కొనియాడారు. ఈ మేరకు అడ్వొకేట్ ట్రస్ట్‌ను రూ.500 కోట్లకు పెంచడమే కాకుండా న్యాయవాదులకు వైద్య బీమా కూడా పెంచుతామని ప్రకటించారు. ఈ క్రమంలో హస్తం పై మండిపడ్డ కేటీఆర్.. కాంగ్రెస్ (Congress)లో సీఎంలు దొరికారు కానీ ఓటర్లు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని వివరించారు. ఈ పోరాటం ఢిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతోందని, తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని అన్నారు.
మరోవైపు కేటీఆర్ మాటలు వింటున్న ప్రతిపక్షాలు.. రాష్ట్ర అభివృద్థి ఒక్క బీఆర్ఎస్ నేతలకి మాత్రమే కనిపిస్తుందని మండిపడ్డాయి. పువ్వుల తోట ఎవరో పెంచితే.. ఆ పువ్వులను అమ్ముకుంటూ బీఆర్ఎస్.. ఆ తోటను కాపాడింది మేమే అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో నెలకొన్న త్రిముఖ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వరకి ఆగవలసిందే..