తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. పాలనలో తన మార్క్ ఉండేలా చూసుకొంటుందని తెలుస్తోంది. అధికారుల బదిలీల నుంచి.. అన్ని శాఖల ప్రక్షాళనలో భాగంగా సమీక్షలు నిర్వహిస్తూ.. ముందుకు వెళ్తుంది. అదీగాక బీఆర్ఎస్ (BRS) హయాంలో అమలైన పథకాల విషయంలో సైతం ముందు చూపుతోవ్యవ హరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే కేసీఆర్ (KCR) పేరుతో వున్న పథకాలను మారుస్తూ రేవంత్ (Revanth) సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవం జరిగితే ఆ బాలింత తల్లికి, నవజాత శిశువుకు ఉపయోగపడే వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా అందించేది.
పేద మద్యతరగతి తల్లులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంలో భాగంగా ఇచ్చే ఈ కిట్ పై, కేసీఆర్ కిట్ అనే పేరు, ఆయన ఫోటో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రజల సొమ్ముతో పంచుతోన్న పథాకాలు కేసీఆర్ పేరు, ఫోటో ఉండటంపై కాంగ్రెస్ ముందునుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కిట్ పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకొంది.
ఇకపై కేసీఆర్ కిట్ పేరును మదర్ ఆండ్ చైల్డ్ హెల్త్ (MCH) గా మారుస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నివాసం కాస్త ఉపముఖ్యమంత్రి నివాసంగా, ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్ గా మారింది. ఇక సొంత స్థలం ఉన్న పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆరుగ్యారంటీ హామీల్లో భాగంగా ఇళ్ళ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది… అందువల్లే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసినట్లు రేవంత్ సర్కార్ వెల్లడించింది.