అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విషయంతో లోక్ సమరానికి సిద్దం అయిన కాంగ్రెస్ (Congress)కు ఖమ్మం (Khammam) పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక పెనుసవాల్‌గా మారింది. ఊహించని విధంగా ఈ స్థానానికి డిమాండ్ ఏర్పడగా.. నేతల మధ్య రాజకీయ అంతర్యుద్ధానికి దారితీస్తోంది. సీటు కోసం ముఖ్య నాయకులు ఢీ కొడుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ స్థానం నుంచి బరిలో దిగేందుకు హేమాహేమీలు పోటీ పడుతున్నారు.
తాజాగా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు సమాచారం.. కాగా ఇప్పటికే మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (Kharge)తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఇందు కోసం వారు బెంగళూరు (Bengaluru)కు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర స్క్రీనింగ్, కేంద్ర ఎన్నికల కమిటీలు మల్లగుల్లాలు పడుతుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
అంతేగాక తెరపైకి రోజుకో పేరు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ జనంలోకి వెళ్తున్న కాంగ్రెస్.. ప్రజలకు ఆరు హామీలను వివరిస్తూ బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేస్తూ ఓట్లను రాబట్టుకొనే పనిలోపడింది. ఇదిలా ఉంటే మొత్తం 17 స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం.. మరో మూడింటిని పెండింగ్‌లో ఉంచింది.
మరోవైపు ఖమ్మం బరిలో నిలబడితే విజయం పక్కా అని భావిస్తున్న నేతలు.. తమ వారికి టికెట్ దక్కించుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి అభ్యర్థిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ నెల 25తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాబట్టి అతి త్వరగానే అధిష్టానం ఒక నిర్ణయానికి రావచ్చని అంటున్నారు..