లోక్‌సభ ఎన్నికల్లో బండి సంజయ్‌ను గెలిపించి ప్రధాని మోడీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ రెండు సెట్ల నామినేషన్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డితో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్యానించారు. మోడీ మరోసారి ప్రధాన మంత్రిని చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు బీజేపీ జెండాలను మోయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 400సీట్లు, తెలంగాణలో 17స్థానాల్లో గెలవడం ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. గ్యారంటీల పేరుతో గారడీ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంటే ఆపే శక్తి కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో ఎంపీలు గెలిచినా వెళ్లేది కాంగ్రెస్‌లోకేనని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని అన్నారు. ‘ఫిర్ ఏక్ బార్ మోడీ’ అనేది ప్రతీ ఇంటి నినాదమైందని వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు. దేశంలో శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ అని అభివర్ణించారు. భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అన్ని సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.