సీఎం కేసీఆర్ (CM KCR) పై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫైర్ అయ్యారు. తెలంగాణ పరిస్థితి అయోమయంగా మారిందని కిషన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన డిజైన్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగి పోయాయని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల సొమ్ము లక్షా 25 వేల కోట్లు వృథాగా పోయాయని ఆరోపించారు. ముథోల్ నియోజకవర్గానికి చెందిన పలువూరు బీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. రాబోయే రోజుల్లో ఉగ్ర వాదులకు, ఎంఐఎం పార్టీకి భైంసా కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముథోల్ నియోజకవర్గంలో అంతా ఐక్యంగా ఉండి ముథోల్, భైంసాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ముథోల్లో మనం చాలా నష్టపోయామని చెప్పారు. పండుగల సందర్బాల్లో ముథోల్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా ఎక్కడంటే అక్కడ మద్యం దొరికే పరిస్థితి ఉందన్నారు.
రైతులను, యువకులను, అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోసారి భైంసా పరిస్థితి గురించి ఆలోచిస్తే పాకిస్తాన్‌లో ఉన్నామా అనే భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెల రోజులు అంతా కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడవచ్చన్నారు.