బీఆర్ఎస్ (BRS) ప్రకటించిన మ్యానిఫెస్టో (manifesto) పై వివిధ పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ (revant), బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పై మండిపడగా, తాజాగా కేంద్రమంత్రి, తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. సకలజనుల ద్రోహి కేసీఆర్ అని, తెలంగాణ ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెడుతున్నారని ఆరోపించిన కిషన్ రెడ్డి.. బెస్ట్ మద్యం పాలసీని అమలు చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ సంపద పెంచాలని అనడం హస్యాస్పదమని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్ వల్ల సంపద పెరగలేదు కానీ అవినీతి మాత్రం ఆనకొండంత పెరిగిందని కిషన్ రెడ్డి దెప్పిపొడిచారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త హామీలు ఇవ్వడం చూస్తుంటే ప్రజలను ఎంతగా మభ్య పెడుతున్నారో అర్ధం అవుతోందని అన్నారు.
అమలుకు నోచుకోని హామీలను ఇస్తున్న కేసీఆర్ మాటలు, చేతలకు పొంత లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సొంత ఫ్యామిలీ పాలసీని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. మరో వైపు కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు..