రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఓడించాల్సిందేనని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో సకల సమస్యలకు కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆయన విరుచుకు పడ్డారు. జై తెలంగాణ అంటే తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ దని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఒక్కరు గెలిచినా వాళ్లను కొనేది కేసీఆరేనని ఆరోపించారు .
హైదరాబాద్లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ…… ఓవైసీనీ ప్రసన్నం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అసలు సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో కుటుంబ వ్యవస్థను పెంచి పోషించింది కాంగ్రెస్సేనని విరుచుకు పడ్డారు. బీజేపీలో తామంతా క్రమశిక్షణతో ముందుకెళ్తున్నామన్నారు. ఇదే జోష్తో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.
మరోవైపు ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీలేనన్నారు. ఎస్పీతో పాటు ఆర్జేడీ, టీఎంసీ, జేఎంఎం పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా వున్నాయని చెప్పారు. ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజ్లో స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. ప్రపంచంలో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కేవలం భారత్లోనే ఉందని తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 9 లక్షల కోట్లు కేటాయించిందని అన్నారు. తెలంగాణలో కమలం వికసిస్తుంటే కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొన్నారు.