మిచాంగ్ (Michon) తుపాను కారణంగా రైతుల (Farmers)కు కలిగిన నష్టాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) తెలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి నాని పరిశీలించారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. తుపాన్ కారణంగా వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయనీ.. తుపాన్ సమయంలో సీఎం ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేశారని అన్నారు. రైతుల పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులను ఆదుకుందామని సీఎం చెప్పినట్లు ఆయన తెలిపారు.
రైతులు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా సాయమందించాలని సీఎం జగన్ చెప్పారని కొడాలి నాని అన్నారు. ఆర్బీకేల ద్వారా రెండు రోజుల్లో సబ్సిడీ ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామని కొడాలి నాని తెలిపారు. విత్తనాలపై రైతులు అడిగిన దానికంటే ఎక్కువగానే సబ్సిడీ ఇద్దామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమనీ.. రంగు మారినా, పని కొచ్చినా, పనికి రాక పోయినా మద్దతు ధరకే ధాన్యం కొనాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రైతాంగం ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే నాని భరోసా ఇచ్చారు.
కాగా, గతంలో రైతులు పండించిన ధాన్యానికి మూడు నాలుగు నెలలకు గడిచినా డబ్బులు పడేవికావని అన్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోందని తెలిపారు. రేపుకానీ, ఎల్లుండి కానీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారని నాని పేర్కొన్నారు.