బీఆర్ఎస్ (BRS)ను ఓడించకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం (Kodanda Ram) అన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించగలిగితేనే భవిష్యత్‌లో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజాస్వామ్య తెలంగాణను ఏర్పాటు చేసేందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు.
మేడిగడ్డ ప్రాజెక్టును కేవలం డబ్బు, కమీషన్ల కోసమే ప్రభుత్వం తొందరగా పూర్తి చేసిందని ఆరోపించారు. అందువల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో జరిగిన స్కామ్ లల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటన్నారు. ప్రాజెక్టు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు శ్వేతపత్రం విడుదల చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్టులు, డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. కానీ మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రం నాలుగేండ్లకే కుంగిపోయిందన్నారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తులు ఎవరో గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ గురించి కేంద్ర నిపుణుల కమిటీలు చెప్పిన విషయాలు తప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అసలు ఏం జరిగిందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోవడమే చోద్యంగా ఉందని అన్నారు. సర్కార్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే దీనిపై ప్రభుత్వం ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును తాము పరిశీలించినప్పుడు 7వ బ్లాక్‌లో 20 పియర్, బ్రిడ్జ్ కుంగిపోయి గేట్ వంగి పోయి కనిపించిందన్నారు. బ్లాక్ మొత్తం 10 మీటర్ల లోతు నుంచి బేస్ ఏర్పాటు చేసి పియర్లు నిర్మించారని, దానివల్ల మొత్తం బ్లాక్ కొత్తగా నిర్మాణం చేపట్టవలసి వస్తుందన్నారు.
కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని, ఈ క్రమంలో ఆ పార్టీకి తాము ఆరు ప్రతిపాదనలు పంపామన్నారు. అందుకు ఆ పార్టీ ఒప్పుకుందన్నారు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని అడిగామన్నారు. ఉపాధి ఉద్యోగ కల్పన జరగాలన్నామన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని కోరామన్నారు. చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలకు తోడ్పాటు అందించాలన్నామన్నారు. కౌలు రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని, రాజ్యాంగం ప్రకారం పాలన నిర్వహించాలని, ఉద్యమ కారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు.