తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. సవాల్ తో కూడిన రాష్ట్ర పరిపాలనలో సీఎంగా తాను సక్సెస్ కావడానికి దోహదపడే అంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.. ఈ క్రమంలో ఇప్పటికే కీలక శాఖలో కొందరి మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి అవ్వగా.. మిగతా వాటి విషయంపై రేవంత్ పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో అణిచివేతకు గురైన వారి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలపై రాష్ట్రంలో చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్.. ఆ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరైన గుర్తింపు పొందలేక పోయారు. మరోవైపు, కోదండరామ్ అనుభవాలన్ని, ఆయన ఆలోచనలను ఉపయోగించుకుంటామని ఇంతకు ముందే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈమేరకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో కోదండరామ్ కి కీలక పదవి దక్కుతుందని అంతా భావిస్తున్నారు. అయితే రేవంత్ చెప్పినట్టుగానే కోదండరామ్ కు కీలక బాధ్యతను అప్పగించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక కోదండరామ్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పార్టీ పెట్టిన అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికార పీఠం నుంచి దూరం కావాలని ఆకాంక్షించారు.
మరోవైపు కోదండరామ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.. అందుకే కోదండరామ్ తన పక్కన ఉంటే సీఎంగా తాను సక్సెస్ కావడానికి ఆయన సలహాలు, సూచనలు దోహదపడతాయని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కోదండరామ్ (Kodandaram) సహకారం కూడా దోహదపడిన సంగతి తెలిసిందే..