మాజీ మంత్రి, సూర్యాపేట (Suryapet) ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagdish Reddy), కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై మండిపడ్డారు.. అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగా అధికారంలోకి వచ్చాక కూడా అలాగే ప్రవర్తించడం సరికాదని సూచించారు. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చారని ఆరోపించిన ఆయన.. వాటిని త్వరగా అమలు చేయాలని డిమాండ్..
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అసహనానికి గురవుతున్నారని ఆరోపించారు.. విపక్ష నేతల మీదున్న కోపంతో రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేయొద్దని కోరారు.. తాజాగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జగదీశ్ రెడ్డి.. మంత్రి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిమిషానికో మాట మార్చే రకం కోమటిరెడ్డి అని వ్యంగాస్త్రాలు వదిలారు.
స్వయంగా ఆ పార్టీ నేతలే కోమటిరెడ్డిని కోవర్టు అంటారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ను 39 ముక్కలు చేస్తా అని మాట్లాడటం.. మంత్రిగా ఉన్న ఆయనకు తగదని మండిపడ్డారు. బీఆర్ఎస్ను చీల్చడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్లనే కాదు ఆయన తాత తరం కూడా కాదని జగదీశ్ రెడ్డి అన్నారు. ఇలాంటి వారిని అనేకమందిని బీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో చూసిందని వెల్లడించారు.