తెలంగాణ మంత్రి(Telangana Minister) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సమయం నుంచి ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే ఇటీవల గొంతునొప్పి ఎక్కువ కావడంతో ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కోమటిరెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితిపై వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ(బుధవారం) సాయంత్రం వరకు ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కోమటిరెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇదివరకే ఎంపీ పదవిలో ఉన్న ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రి పదవి రావడం పూర్తయ్యాక తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజధాని ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. త్వరలో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం చేపడతామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో 340కి.మీల హైవేను ఆరు లేన్ల రహదారిగా మార్చనున్నట్లు వెల్లడించారు. గత సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు.