మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ(Nalgonda)లోని మంత్రి క్యాంపు కార్యాలయం(Minister Camp Office)లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో మూడు నెలల తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని, దమ్ముంటే టచ్ చేసి చూడండంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
తెలంగాణ భవన్(Telangana Bhavan) పునాదుల దగ్గర నుంచి లేపేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలుస్తామనేందుకు మీకు ఎన్ని గుండెలని ఆక్షేపించారు. కేసీఆర్(KCR) లాగా రేవంత్ రెడ్డి చిల్లర దందాలు చేయలేదని అన్నారు. కేసీఆర్ కొడుకు కాబట్టే కేటీఆర్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు.
రైతుబంధు, రుణమాఫీ ఎన్నికల కోడ్ ఉన్నందునే అమలు కాలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిశాక అన్ని హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ ఎందుకు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. జగన్, కేసీఅర్ కుట్రల వల్ల కృష్ణా జలాల పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు వచ్చినా తాను దేనికైనా సిద్ధమన్నారు.
కవితను చూస్తే జాలేస్తుందని, కేసీఆర్ కుటుంబ దగా వల్ల కవిత బలైందని ఆరోపించారు. కనీసం బిడ్డకు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మేం తలచుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో చేరేవారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 5వ తేదీ నుంచి ప్రభుత్వ పాలనపై దృష్టి పెడతామన్నారు.